Breaking News

ఇటువంటి దుర్మార్గులను ఏం చెయ్యాలి?

ఈరోజు సాక్షి దిన పత్రికలో వచ్చిన వార్తను చూసి మనసంతా బాధతో నిండిపోయింది. స్త్రీలకు ఎక్కడికెళ్లినా రక్షణ లేదా? ఆఖరికి యాక్సిడెంట్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్న మన దేశ ఆడబిడ్డకు హాస్పటల్లో కూడా రక్షణ లేదంటే మన దేశం ఎటు ప్రయణిస్తుంది? ఇటువంటి మానవ మృగాలను ఏమి చెయ్యాలి?
రాయ్‌పూర్: ఓ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలతో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం అరెస్టయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గౌతం పండిట్‌తో పాటు కానిస్టేబుళ్లు చంద్రప్రకాశ్ పాండే, సౌరబ్ భక్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం జూన్ 19న రోడ్డు ప్రమాదంలో గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆ సమయంలో డాక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా కానిస్టేబుళ్లు ఇద్దరూ వేధించడం మొదలు పెట్టారు. వీడియో చూపించి బెదిరిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటున్నారు. మంగళవారం కూడా ఆమెను నగర శివార్లలోకి తీసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచడంతో పోలీసులు పారిపోయారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో నగర శివారులోని ఒక పవర్ హౌస్ వద్ద విద్యార్థినిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. ఆమె మొత్తం జరిగిన సంఘటనను పోలీసులకు వివరించింది. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  ఆ డాక్టర్ ను, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్ పీ రాజేష్ అగర్వాల్ చెప్పారు. 
ఆధారం: http://www.sakshi.com/news/national/2-cops-doctor-held-for-raping-college-student-202087

5 comments:

  1. శృంగారం మీద అత్యంత కఠినమైన విధినిషేధాలున్న సమాజాల్లో కామవాంఛ వింతపోకడలు పోతుంది. అలాంటి చోట్ల శృంగారానికి సరైన ఔట్ లెట్ దొఱక్క జనం పొద్దస్తమానం ఆవురావురుమంటూ ఉంటారు. దొఱికినవాళ్ళతో గడిపేసుకుందామనే ఆత్రం ప్రబలుతుంది. మన దేశ పరిస్థితి ప్రస్తుతం ఇదే. దీనికి పరిష్కారం ఇంకా ఇంకా విధినిషేధాల్ని పెంచుకుంటూ పోవడం కాదు. ఉన్నవాటిని కాస్తయినా సడలించడమే. ముఖ్యంగా ప్రతి స్త్రీపురుష సంబంధాన్నీ వివాహం అనే కళ్ళద్దాలలోంచి చూసే సంస్కృతి పోవాలి. అలాగే స్త్రీపురుష సంబంధాల్ని డబ్బుచట్రంలో చట్టబద్ధంగా ఇఱికించకూడదు. ఇద్దఱు మనుషుల మధ్య శృంగారాన్ని కూడా ఇద్దఱు మనుషుల మధ్య స్నేహంలాగే క్యాజువల్ గా చూసే దృక్పథం పెంపొందాలి.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. మీ అభిప్రాయంలో శృంగారాన్ని విచ్చలివిడిగా వాడుకొనే పద్ధతి రావాలనడం, పెళ్లి అనే హద్దులు చెరిపేసుకోవాలనడం సమాజానికి మంచిది కాదు. అదీ నైతిక విలువలు సంస్కృతి,సంప్రదాయాలు విరుస్తున్న మన దేశంలో...దారుణం కదూ!

      Delete
  2. అయ్యా! దయచేసి కొన్ని వాస్తవాల్ని గమనించండి. సెక్సు తప్పు కాదు. అది ప్రకృతికి సంబంధించినది. ప్రకృతిలో పెళ్ళి లేదు. సెక్సు మాత్రమే ఉంది. సెక్సు నేఱం కాదు. ఎందుకంటే అది అందఱూ రోజూ చేసుకుంటున్నదే, మీ సంస్కృతి-సంప్రదాయాల దేశంతో సహా! సెక్సు అనేది డబ్బులాగా నీతికి సంబంధించిన విషయం కాదు. ఇద్దఱు మనుషుల మధ్య అంగీకారానికి సంబంధించిన విషయం. అది ఉంటే ఏ శృంగార సంబంధమూ హానికరం కాదు. మనుషులకు సెక్సువాంఛలు చాలా చిన్నవయసులోనే మొదలవుతాయి. పెళ్ళి మాత్రం పూర్తిగా డబ్బుకు సంబంధించిన అంశం కావడంతో సెక్సు కూడా దానికి ముడిపెట్టబడి - ఆ పెళ్ళి వెంటనే చేసుకోలేక, అది అయ్యే దాకా ఆగలేక జనం నానా వక్రమార్గాలు తొక్కుతున్నారు. అలాంటివాళ్ళు వాళ్ళకిష్టమైన దారిలో వారు ఆ ప్రేరణని సంతృప్తిపఱచుకునే మార్గాలు కొఱవడి మానభంగాలు కూడా పెచ్చుమీఱుతున్నాయి. ఈ చట్రంలో ఆడా-మగా సమానంగా ఇఱికించబడ్డారు. ఒకఱు సిద్ధంగా ఉంటే రెండోవారు ఉండరు. అందుచేత సెక్సుని అవాంఛనీయాల జాబితాలోంచి తొలగించి వాంఛనీయాల జాబితాలో చేర్చడం సమాజానికి ఈ యుగావసరం. మనకిష్టమున్నా లేకపోయినా ఈ ప్రక్రియ ఆల్రెడీ చాప కింద నీరులా మొదలయిపోయింది. ఇది ఇంకా ముందుకు, మునుముందుకు పోవడమే తప్ప ఆగడం జఱగదు.

    ReplyDelete
    Replies
    1. "పెళ్ళి మాత్రం పూర్తిగా డబ్బుకు సంబంధించిన అంశం కావడంతో సెక్సు కూడా దానికి ముడిపెట్టబడి - ఆ పెళ్ళి వెంటనే చేసుకోలేక, అది అయ్యే దాకా ఆగలేక జనం నానా వక్రమార్గాలు తొక్కుతున్నారు."
      ఈ మీ అభిప్రాయాన్ని నేను అంగీకరిస్తాను. పెళ్లి బరువైనవాళ్లందరూ వక్రమార్గాలు తొక్కడం అనేది అతి సహజంగా జరిగే పనే! పెళ్లిని హంగూ,ఆర్భాటాలకూ హోదాలకూ, కట్నకానుకలకూ ఎప్పుడైతే నిలయంగా మార్చేసారో అప్పుడే ఇవ్వన్నీ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ పోవాలంటే పెళ్లి సులభతరం చేస్తే సరిపోతుంది కదా? అలా కాకుండా ఇద్దరి అంగీకారం ఉంటే సెక్స్ తప్పు కాదనడం, వాటికి హద్దులు తీసేయాలనడం సమంజసమా? ఒక ఆలోచించండి సర్. ఎదుటివాళ్లతో అంగీకారం కుదిరితే వాళ్లతో సెక్స్ తప్పుకానప్పుడు ఎవరు ఎంతమందితో నైనా సంబంధాలు పెట్టుకోవచ్చు కదా? ఇంకా అటువంటి వారిని నిరోధించాలనుకోవడం తప్పు కూడా అవుతుంది. ఎందుకంటే మీరన్నట్టు పకృతిలో పెళ్లి లేదు కదా సర్. మీ చెప్పినదానిని బట్టి ఒక విషయం ఆలోచిద్దాం. ఒక భార్యకు పక్కవాడితో సెక్స్ కు అంగీకారం అయ్యింది.ప్రతిరోజూ వాడితో తన సుఖాన్ని పంచుకుంటూ గడుపుతోంది. ఈ విషయం భర్తకు తెల్సినప్పుడు ఏమి చేయాలి? మీరన్నట్టు ప్రకృతి సిద్దమైనది కాబట్టి పట్టించుకోకూడదు. వారికి అడ్డు చెప్పడం నేరం అవుతుంది కదా? ఈవిధంగా ఎవరైనా ఉండగలరా? చెప్పండి సర్? మరొక విషయం ఒక కాలేజీ అమ్మాయి తన బాయ్ ప్రెండ్స్ తో సంబoధాలు పెట్టుకుని శారీరక సుఖాలను అనుభవిస్తోంది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వారు ఏమి చేయాలి? ప్రకృతి సిద్ధమైనది కాబట్టి వదిలి వేయాలా? ఏ తల్లిదండ్రులైనా అలా ఉండగలరా? చెప్పండి. మీరు ప్రకృతిలో పెళ్ళి లేదన్నారు నిజమే!కాని హద్దు ఉంది. ప్రకృతి అయినా హద్దు దాటితే నాశనమవుతుంది.అదే విధంగా సెక్స్ కు కూడా హద్దు ఉంది. ఆహద్దు పేరే పెళ్లి అంటారు.

      Delete
  3. ఆర్యా! ప్రకృతిలో సెక్సుతో పాటు స్నేహభావన కూడా ఉంది. ఆ స్నేహంలోంచి పుట్టుకొస్తాయి ప్రేమలూ, ఇంకా అనేక కమిట్ మెంట్ భావాలు. ఆ స్నేహంలోంచే పుట్టుకొస్తారు ఏకపత్నీవ్రతులూ, పతివ్రతలూ. ఆ స్నేహభావం లోపిస్తే సెక్సూ, దాంపత్యం, సంసారం అన్నీ మనిషికి పనిష్మెంటుగా మారతాయి. మనం ప్రమోట్ చేయాల్సింది- అత్యంత మౌలికమైన ఆ స్నేహ మార్దవాన్నే. పెళ్లినీ, ఇంకా అలాంటి ఛప్పన్న కరుడుగట్టిన వ్యవస్థల్నీ, వాటి నాశ్రయించుకుని నడిచే విడాకులూ, భరణాలూ, నేఱాలూ, అరెస్టులూ, శిక్షలూ లాంటివి కాదు. నా భావం మీకు అర్థమయిందనుకుంటాను.

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్